UPDATED 13th DECEMBER 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ, ఫోరెన్సిక్ కళాశాలల ఆధ్వర్యంలో ఆధునిక ఫోరెన్సిక్ పితామహుడు డాక్టర్ అడ్మన్డ్ లోకార్ట్ 141వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆధునిక ఫోరెన్సిక్ సైన్స్ కు దిశానిర్దేశం చేసిన డాక్టర్ లోకార్ట్ సేవలు ప్రపంచానికి, నేడు నేరపరిశోధనా విభాగానికి దిశానిర్దేశం చేస్తున్నాయని, 21వ శతాబ్దానికి ఆయన సూత్రాలు ఒక ప్రత్యేక శైలిని నేరపరిశోధనా రంగంలో కనబరుస్తున్నాయని ఆదిత్య ఫోరెన్సిక్ సైన్స్ విభాగాధిపతి, ప్రిన్సిపాల్ ఇ. మోహన్ అన్నారు. విద్యార్థులు డాక్టర్ లోకార్ట్ ను ఆదర్శంగా తీసుకుని తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా, దక్షిణ భారతదేశంలో రెండవది అయిన ఆదిత్య ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో అత్యాధునిక ప్రయోగశాలలు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్వహించడం జరుగుతుందని, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ శాస్త్రవేత్తలుగా దేశ, విదేశాల్లో తమ సేవలు అందించాలని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. .







