UPDATED 1st FEBRUARY 2018 THURSDAY 6:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో కర్ర పెండలం, ఉద్యాన పంటలపై డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానంలో రైతులకు అవగాహనా సదస్సు గురువారం నిర్వహించారు. సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి. రామనాథం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పాల్గొని మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాకు తరలిన ఉద్యాన పరిశోధనా కేంద్రం పెద్దాపురంకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కృషి వల్లే తిరిగి వచ్చిందని, దుంప రైతుల సమస్యలు పరిష్కరించడంలో మంత్రి చర్యలు తీసుకుంటారని అన్నారు. రాష్ట్రంలో 75 శాతం కర్రపెండలం దుంప తూర్పుగోదావరి జిల్లాలోనే ఉందని, అందులో పెద్దాపురం పరిసర ప్రాంతంలో దుంప పంట రైతులు ఎక్కువగా ఉన్నారన్నారు. దుంప రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి శాగో మిల్లర్స్, రైతులు, సంబంధిత అధికారులతో శనివారం హోంమంత్రి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుందన్నారు. ప్రభుత్వం రైతాంగానికి సబ్సిడీలపై అందచేస్తున్న వ్యవసాయ పరికరాలను వినియోగించుకుని రైతులు మేలు పొందాలని తెలిపారు. ఉద్యానవన శాఖ ఎడి కె. గోపీకుమార్ మాట్లాడుతూ భారతదేశంలో దుంపతోటలు పెంపకంలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని, రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా 75 శాతం ఆక్రమించాయని, కర్ర పెండలం దుంప రైతులకు 50 శాతం సబ్సిడీపై వీడర్లు అందచేస్తున్నామని అన్నారు. జిల్లా దుంప రైతు సంఘ అధ్యక్షుడు పుట్టా సోమన్నచౌదరి మాట్లాడుతూ హోంమంత్రి చినరాజప్ప రైతులు, అధికారులు కృషితో దుంప పరిశోధనా కేంద్రం తిరిగి ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని, దుంప పంటకు మద్దతు ధర కల్పించడానికి మంత్రి చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం దుంప పంట పరిశోధనా కేంద్రం పెద్దాపురం తిరిగి రావటానికి కృషి చేసిన రైతు పాలచర్ల విశ్వనాధంను చైర్మన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, ఎంపిపి గుడాల రమేష్, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ ఆర్.వి.ఎస్.కె. రెడ్డి, జోనల్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ బి.వి.కె. భగవాన్, శాస్త్రవేత్తలు డాక్టర్ జి. రామానందం, డాక్టర్ ఎం. జానకి, కె. మమత, బి. రమేష్ బాబు, ఎం. చలపతిరావు, ఐ. సుధీర్ కుమార్, ఉద్యానవన శాఖ ఎడి సిరిల్, శాగో మిల్లర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ ఎం. వెంకటరావు, కమ్మిల సుబ్బారావు, రంధి సత్యనారాయణ, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.







