UPDATED 5th OCTOBER 2022 WEDNESDAY 06:10 PM
Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి ఉన్నారు. ఆలయ అర్చకులు చంద్రబాబుకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.
నాడు తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఇంద్రకీలాద్రి పై ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు చంద్రబాబు. పుష్కరాల సందర్భంగా ఘాట్‌రోడ్‌ను అభివృద్ధి చేశామని.. రూ.150 కోట్లతో ఇంద్రకీలాద్రిపై వసతులు కల్పించామని గుర్తుచేశారు. ఆ అభివృద్ధి పనులను కొనసాగించాలని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు అందించాలన్నారు. రాష్ట్రాన్ని చల్లగా కాపాడమని అమ్మవారిని కోరానని చంద్రబాబు తెలిపారు. ఈరోజున పూజ చేసి ఏ కార్యక్రమం చేసినా ఫలిస్తుందన్నారు.
అమరావతి అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందని.. అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తెచ్చి..అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు. రాజధాని ప్రజల సంకల్పమని.. దీనిపై రోజుకొక మాట మాట్లాడటం సరికాదని చంద్రబాబు హితవు పలికారు.







