తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో క్యాలెండర్లు ముద్రించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం 3డీ ఎఫెక్ట్, సిల్వర్ కోటింగ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల క్యాలెండర్‌ను తితిదే ఈవో జవహర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. 25 వేల క్యాలెండర్లు ముద్రించామని, ఒక్కో వాటి ధర రూ.450 అని వెల్లడించారు. తిరుమల, తిరుపతితో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీలో అందుబాటులో ఉంచామన్నారు. తితిదే ఐటీ సలహాదారుగా అమర్ నాగారం.. తితిదే ఐటీ సలహాదారుగా మింత్రా సీఈవో అమర్ నాగారంను నియమిస్తూ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం నియామక పత్రాలను జారీచేశారు. మింత్రా సీఈవో అమర్ నాగారం, తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి తితిదే ఛైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు.







