చిలకలూరిపేట (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్డెర కాలనీలకు చెందిన 14 మంది మహిళా కూలీలు ఆటోలో పత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పత్తితీత పనులకు బయలుదేరారు. యడ్లపాడు వద్దకు రాగానే ఆటోను ఓ వాహనం వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షేక్ దరియాబి(55), బేగం(52) మృతిచెందారు. మిగతా ఏడుగురిలో మీనాక్షి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







