ఎకో టూరిజం అభివృద్ధికి అవసరమైన చర్యలు

UPDATED 26th OCTOBER 2020 MONDAY 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలో  కోనసీమ, మారేడుమిల్లి ప్రాంతాల్లో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్ నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి. లక్ష్మీశ, జి. రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నదీ వ్యవస్థ, అడవులు, ఆధ్యాత్మిక క్షేత్రాల పరంగా జిల్లాకు ఎంతో గొప్ప విశిష్టత ఉందని, ఈ నేపథ్యంలో జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు. పర్యాటక శాఖ నిధులతో చేపట్టిన ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులు కోసం ఏపీ టిడిసికి నివేదిక పంపించడం జరిగిందన్నారు.  పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లాలో అనువైన ప్రాంతాలు ఉన్నాయని, ప్రధానంగా కోనసీమ, మారేడుమిల్లి ప్రాంతాల్లో ఎకో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. దీనికి అవసరమైన 20 ఎకరాల భూమి సేకరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కోరంగి దగ్గర పర్యాటక శాఖ నిర్మించిన భవనాలను అటవీ శాఖకు అప్పగించాలని, అలాగే రాజమహేంద్రవరంలో ఉన్న హెవలాక్  బ్రిడ్జ్ అభివృద్ధిపై పర్యాటక శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. అమలాపురం దగ్గర పాశర్లపూడి, ఆదూరు ప్రాంతాలలో పర్యాటక శాఖకు చెందిన భవనాలను  వినియోగంలోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రంపచోడవరం, చింతూరు ఐటిడిఎ పీవోలు ప్రవీణ్ ఆదిత్య, రమణ, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు టి. రాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి పి. వెంకటాచలం, డివిఎంటి వీరనారాయణ, ఈఈ ఎంవి. రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us