UPDATED 29 MARCH 2022 TUESDAY 09:15 PM
Chandrababu On Youth Seats : తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా జరుగుతున్న వేడుకల్లో మాట్లాడిన చంద్రబాబు.. యువ మంత్రాన్ని పఠించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున 40 శాతం సీట్లను యువతకే కేటాయించనున్నట్లుగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
యువతను ప్రోత్సహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్న చంద్రబాబు.. పార్టీ కోసం యువత ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. శక్తి సామర్థ్యాలు ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. సమాజహితం కోరే వారు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సంపదను సృష్టించడంలో టీడీపీ ముందుందని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
”ప్రస్తుతం 40 సంవత్సరాలకు సరిపడ సమర్థవంతమైన నాయకత్వం ఏర్పాటు చేసుకోవాలి. యువతకు విజ్ఞప్తి.. తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలపైన దాడి జరుగుతోంది. సీబీఐ, ఎన్నికల కమిషన్, పార్టీ ఆఫీస్, ఇంటిపైనా దాడి చేశారు. మీ తాటాకుల చప్పుళ్లకు ఎవరూ భయపడటం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. తెలంగాణలో సైతం సభ్యత్వ నమోదు చేస్తాం” అని చంద్రబాబు అన్నారు.







