* తొమ్మిది లక్షలు గృహాలు నిర్మాణం
* ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కానున్న రాష్ట్ర విధానం
* రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ
UPDATED 30th DECEMBER 2017 SATURDAY 8:00 PM
పెద్దాపురం: రాష్ట్రంలో పి.ఎం.ఎ.వై, ఎన్.టి.ఆర్. నగర పథకం కింద అత్యాధునిక షీర్ వాల్ టెక్నాలజీతో పట్టణ పేదలకు గృహాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రోడ్లో నిర్మిస్తున్న పట్టణ గృహ నిర్మాణ పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భగా గృహనిర్మాణ లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక హంగులతో పేదలకు పక్కాగృహాలు నిర్మించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని, దీనికనుగుణంగానే ఎంత వ్యయమైనా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో గృహ నిర్మాణాల కోసం తొమ్మిది లక్షలు దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 6.41 లక్షలు గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పట్టణ గృహనిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైందని, రాష్ట్రంలో పట్టణ పేదల ఆవాసాలను బట్టి 300, 365, 430, చదరపు అడుగుల విస్తీర్ణాల్లో మూడు విభాగాలుగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పట్టణ గృహనిర్మాణం చురుగ్గా సాగుతోందని, మొదటి విడతలో 1750 గృహాలు మంజూరయ్యాయని, త్వరలో మరో 1000 గృహాలు మంజూరు చేస్తామన్నారు. అలాగే మరిడమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద రూ.30 లక్షలుతో నిర్మించిన మున్సిపల్ గెస్ట్ హౌస్, 108 అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ ఛైర్మన్ కొరుపూరి రాజు, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ ఆర్.డి. సాయి శ్రీకాంత్, డిడ్ కో ఎస్.ఈ. శ్రీనివాసరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, ఎ.ఎం.సి. చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, పట్టణ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్.శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.







