కానిస్టేబుళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

UPDATED 5th MAY 2018 SATURDAY 9:00 PM

కాకినాడ: కానిస్టేబుళ్లు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఎ.పి.ఎస్.పి మూడవ బెటాలియన్‌ గ్రౌండ్స్ లో కమాండెంట్‌ జె. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 2017-18 బ్యాచ్‌ శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని, ఐజి(పర్శనల్‌) ఎన్‌. శ్రీధరరావు, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌ గున్ని తదితరులు పాల్గొని శిక్షణ పొందిన 261మంది పోలీసు కానిస్టేబుళ్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండెంట్‌ కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించి పరేడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండేలా ప్రత్యేక కృషి చేస్తున్నారని, శాంతి భద్రతలతోనే సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. కొత్తగా 5,867 కానిస్టేబుళ్లు, 662మంది ఎస్సైల నియామకం చేపట్టి , వీరికి రాష్ట్ర వ్యాప్తంగా19 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. ముఖ్యంగా కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లలో ఎంటెక్‌, బిటెక్, పిజి చదివిన వారు ఉన్నారని, అకుంఠిత దీక్షతో శిక్షణ ముగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు, పేదల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు. అనంతరం శిక్షణలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సత్కరించి ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ యం. నాగేంద్రబాబు, అసిస్టెంట్ కమాండెంట్లు, డీఎస్పీలు, రిటైర్డ్ పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us