UPDATED 10th JUNE 2018 SUNDAY 8:00 PM
సామర్లకోట: రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలిన టిడిపి ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి ప్రతీ కార్యకర్త సైనికుడిలా పోరాడాలని వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పిలుపునిచ్చారు. పట్టణంలో స్థానిక 10, 11 వార్డులకు సంబంధించి ఆదివారం నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సంతకాలు చేసిన పథకాలకు దిక్కు లేదని విమర్శించారు. మహిళల డ్వాక్రా రుణాల మాఫీ, వ్యవసాయ రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన వంటి ఎన్నో పథకాలు అటకెక్కాయని గుర్తు చేశారు. ప్రజల జీవితాల్లో చీకట్లు ఏర్పడ్డాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి వెలుగులు రావాలంటే రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్‌సిపి అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర ఈ నెల 12న జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీ నారాయణ, కంటే వీర్రాఘవులు, పట్టణ కార్యదర్శి సేపేని సురేష్, వార్డు కౌన్సిలర్ కాళ్ళ లక్ష్మీనారాయణ, మేకా శ్రీనివాస్, గోపు మురళీ, డేగల భాస్కర్, కానుబొయిన విజయకృష్ణ, వేగి సత్యన్నారాయణ, మద్దాల శ్రీను, సారంపాటి లొవచారి, శెట్టిబత్తుల దుర్గ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







