UPDATED 12th JULY 2017 WEDNESDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో బుధవారం మహిళా విద్యా హక్కుల ఉద్యమ నేత మలాలా డే ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణా రెడ్డి హాజరై మాట్లాడారు. పాకిస్థాన్ లో 1997 జులై 12 న జన్మించిన మలాలా మహిళల హక్కుల గురించి, స్త్రీ విద్య, లింగవివక్ష మొదలైన విషయాలపై పోరాటం చేసారు. అతి పిన్న వయసులో 2008 నుంచి ఆమె న్యాయ పోరాటం ప్రారంభించారు. 2013 సంవత్సరంలో తన పుట్టినరోజు నాడే మహిళల హక్కులు గురించి, స్త్రీ విద్య, లింగవివక్ష కోసం ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఆమె చేసిన ఉద్వేగ పూరిత ప్రసంగం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. ఆమె గౌరవార్ధం ఆ రోజు మలాలా డే గా ఐక్య రాజ్య సమితి ప్రకటించిందన్నారు. మలాలా ఫౌండేషన్ ను స్థాపించి విద్యకు తోడ్పాటును అందించేలా చేసిన ఆమె కృషి అమోఘమన్నారు. అలాగే ఆమె రచించిన ఐ ఆమ్ మలాలా పుస్తకం యువతకు ఎంతో ఆదర్శమన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







