UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 10:00 PM
అనపర్తి / రంగంపేట: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు వెళ్లే కెనాల్ రోడ్డులో కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం సామర్లకోట నుంచి కెనాల్ రోడ్డులోని కల్వర్టులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సుమారు 61 కి.మీ ఈ రోడ్డు పనులు 2011లో ప్రారంభమయ్యాయని, పనుల్లో జాప్యం చేయడంతో కాంట్రాక్టు రద్దు చేశామన్నారు. ఈ జాప్యం కారణంగా ప్రపంచ బ్యాంకు నిధులు వెనక్కి పోయాయన్నారు. అనంతరం సుమారు రూ.ఆరు కోట్లతో రోడ్డుకు మరమ్మతులు చేశామని, 61 కి.మీ. రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు అవసరమవుతుందని, ముఖ్యమంత్రితో మాట్లాడి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు సుమారు 404 కి.మీ.లు పొడవైన జాతీయ రహదారిని రూ. రెండు వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామన్నారు. ఇది రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, విశాఖ జిల్లా లంబసింగి, పాడేరు, అరకు లోయ మీదుగా విజయనగరం చేరుకుంటుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్ళలో చంద్రన్నబాటలో భాగంగా 15 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించామని మంత్రి తెలిపారు. వెంకటాపురం వద్ద రూ.ఆరు కోట్లతో కోటపాడు- ఈలకొలను గ్రామాల మధ్య నిర్మించిన రోడ్డును మంత్రి అయ్యన్నపాత్రుడు, రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు సత్తి దేవదానరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, రాజమహేంద్రవరం ఎంపి ఇంఛార్జ్ మాగంటి రూపాదేవి, ఆర్ అండ్ బి శాఖ ఎస్‌ఈ సీఎస్‌ఎన్.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.







