ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడి
పుణె (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం మహారాష్ట్రలో 8,067 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్యలో 50 శాతం వృద్ధి రికార్డయ్యింది. ఈ నేపథ్యంలోనే పవార్ హెచ్చరించాల్సి వచ్చింది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ సైతం ప్రజలను ఇదే కోరారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు విధించారని పేర్కొన్నారు. ముంబయి, పుణెలో కేసులు అత్యధికంగా ఉన్నాయని వెల్లడించారు.







