UPDATED 27th MARCH 2022 SUNDAY 09:00 PM
Minister KTR : ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లోని పలు సంస్ధలతో ఆయన జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చివరి రోజు భారీ పెట్టుబడుల వరదతో మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఫలప్రదంగా ముగిసిందని చెప్పవచ్చు. చివరి రోజు పర్యటనలో తెలంగాణలో 4 సంస్థలు పెట్టుబడి పెట్టటానికి సంసిధ్దత వ్యక్తం చేశాయి.
హైదరాబాద్ లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రెడీ అయింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామావు న్యూయార్క్ లోని అడ్వెంట్ ఇంటర్నేషన్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్ లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ మీటింగ్ లో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories) లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ కంపెనీ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
“హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ నిర్ణయం నాకు సంతోషాన్ని కలిగించింది. అడ్వెంట్ కంపెనీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇతర లాభదాయక పెట్టుబడి అవకాశాలను కంపెనీ అన్వేషిస్తుందన్న నమ్మకం నాకుంది. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాము”- అని మంత్రి కేటీఆర్ అన్నారు.న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించంది.
రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు 1500 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనుంది. సిజిఎంపి (CGMP)ల్యాబ్ తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించబోతుంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ కంపెనీ సుమారు 2300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. మంత్రి కె.తారకరామారావు తో సమావేశం తరువాత స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్ సింగ్ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేసింది.
2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు సీఈఓ అజయ్ సింగ్ వివరించారు. అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జెనెరిక్ ఔషధాల తయారీ, అనుమతులు పొందడానికి అవసరమైన క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత తమ కంపెనీకి ఉందన్నారు. హైడ్రాక్సీప్రోజెస్టెరాన్ 5 ఎం.ఎల్ జెనరిక్ ఔషధానికి సంబంధించిన అనుమతులను పొందడంతో పాటు అమెరికన్ మార్కెట్ లో తొలిసారి ప్రవేశపెట్టింది తమ కంపెనీనే అన్నారు.







