ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. వివిధ కార్మిక చట్టాలను సవరించి వేతనాలు; సామాజిక భద్రత; పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత; ఆరోగ్యం, పని పరిస్థితులు పేరిట నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఇప్పటికే కేంద్రం నియమ నిబంధనలను రూపొందించింది. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలు కూడా నిబంధనలు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే 13 రాష్ట్రాలు ముసాయిదా నియమావళిని ప్రచురించాయి. అన్ని రాష్ట్రాలూ నిబంధనలను ఖరారు చేశాక వచ్చే ఏడాది నుంచి ఈ లేబర్ కోడ్‌లు అమల్లోకి రానున్నాయని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు అన్ని రాష్ట్రాలు నియమావళిని ఖరారు చేయనున్నాయి. కాబట్టి అప్పట్నుంచి లేబర్ కోడ్‌లు అమల్లోకి రానున్నాయి. 2021 ఫిబ్రవరిలోనే కేంద్రం నియమ నిబంధనల రూపొందించే ప్రక్రియను పూర్తి చేసింది. ఉమ్మడి జాబితా అంశం కావడంతో రాష్ట్రాలు సైతం ఖరారు చేస్తే ఒకేసారి లేబర్ కోడ్‌లను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది’’ అని సదరు అధికారి వివరించారు. వేతనాలకు సంబంధించిన లేబర్ కోడ్‌కు 24 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించి 20 రాష్ట్రాలు, సామాజిక భద్రతకు సంబంధించి 18 రాష్ట్రాలు, ఆరోగ్య, పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌కు 13 రాష్ట్రాలు నియమ నిబంధనలను ఖరారు చేసినట్లు ఇటీవల కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజ్యసభలో వెల్లడించారు.







