* రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* పెద్దాపురంలో రూ.60 లక్షలతో నిర్మించిన మోడరన్ అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన హోంమంత్రి
UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 7:00 PM
పెద్దాపురం: రాష్ట్రవ్యాప్తంగా మోడరన్ అగ్నిమాపక కేంద్రాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం-జగ్గంపేట రహదారిలో శతాబ్దిపార్కు వద్ద రూ.60 లక్షలతో నిర్మించిన మోడరన్ అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.రత్నబాబు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్దాపురం, చిత్తూరు జిల్లా కుప్పంలో మోడరన్ అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. నేడు పిఠాపురంలో అగ్నిమాపక కేంద్రాన్ని కూడా ప్రారంభించామని తెలిపారు. ప్రజల భద్రతపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలను సమకూర్చి ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించే చర్యలు చేపట్టామని తెలిపారు. అగ్నిమాపక శాఖకు వరదలు, తుఫాన్లు, రోడ్డు ప్రమాదాలు కేటాయించడం జరిగిందని, అలాగే ఈ శాఖ ద్వారా మహిళలకు, స్కూలు విద్యార్థులకు ప్రమాదాలు నివారణకు సంబంధించి అవగాహనా సదస్సులు కూడ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అగ్నిమాపక శాఖలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై ప్రమాదాలు నివారించుకునే అంశాలను పాటించాలని అన్నారు. విద్యార్హతతో పాటు పైర్ సేఫ్టీ శిక్షణ ధృవీకరణ పత్రాలను పొందినవారికి ఉద్యోగాలలో అవకాశాలు ముందుగా ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వంద సంవత్సరాలు చరిత్ర గల పెద్దాపురం మున్సిపాల్టీలో ఉన్న అగ్నిమాపక కేంద్రం శిథిలావస్థలో ఉన్న భవనంలో నిర్వహణ చూసి ఈ నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడిన పిల్లలకు ఆక్సిజన్ అందించడానికి వారి సమాచారం తెలుసుకోవడానికి విక్టిమ్ లోకేషన్ కెమెరాను సమకూర్చడం జరిగిందన్నారు. పరిశ్రమలలో ప్రమాదాలు నివారణకు యాజమాన్యం ఫైర్ ఆఫీసర్ ఉద్యోగిని ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి కావచ్చిందని, సెంటర్ లైటింగుకు రూ.3 కోట్లు మంజూరు అయిందని చెప్పారు. రూ. 6 కోట్లుతో ఎడిబి రోడ్డు నుంచి కాండ్రకోట వరకు రోడ్డు నిర్మిస్తున్నామని, అలాగే రాజానగరం నుంచి సామర్లకోట వరకు రూ. 250 కోట్లుతో రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. జగ్గంపేట రోడ్డును కూడా అభివృద్ధిలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. సామర్లకోట, పెద్దాపురం పట్టణంలో చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో ప్రతీ వార్డులో సిసిరోడ్లు, డ్రైన్లు, మంచినీరు కల్పించామని, అందరికీ ఇళ్ళు పథకం ద్వారా 1000 ఇళ్ళు అక్టోబరు నాటికి, మరో 1000 ఇళ్ళు నవంబరు నాటికి, వచ్చే సంవత్సరం జనవరి నెల నాటికి పూర్తిస్థాయిలో ఇళ్ళు అందచేయడం జరుగుతుందని తెలిపారు. అన్న క్యాంటిన్ అక్టోబరు రెండవ తేదీన ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనుమతి లేకుండా మందుగుండు సామాగ్రిని తయారు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వీటిపై ప్రజలు కూడ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ కె. సత్యనారాయణ మాట్లాడుతూ ఏడు నెలల వ్యవధిలో మొట్టమొదటిగా మోడరన్ అగ్నిమాపక కేంద్రాన్ని పెద్దాపురం, కుప్పంలో మంజూరు కాగా మొట్టమొదటిగా ప్రారంభమైన అగ్నిమాపక కేంద్రం పెద్దాపురం అన్నారు. కుప్పంలో పనులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. అగ్నిమాపక శాఖ ద్వారా తక్కువ సమయంలో ప్రమాదాలు నుండి ప్రజలను రక్షించడానికి సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం అగ్నిమాపక వాహనాలను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రిని డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ సన్మానించి మెమోంటోను అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కురిపూరి రాజు, అగ్నిమాపక శాఖ అదనపు డైరెక్టర్ పి. వెంకటరమణ, పెద్దాపురం ఫైర్ ఆఫీసర్ బి. ఏసుబాబు, 27వ వార్డు కౌన్సిలర్ కుండల హరిబాబు, టిడిపి పట్టణ అధ్యక్షుడు రంధి సత్యనారాయణ, జిల్లాలోని అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బంది, తదితరులు పొల్గొన్నారు.







