* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* రూ.3.86 కోట్లు నిధులతో ఆధునీకరించిన గాంధీ పార్కును ప్రారంభించిన చినరాజప్ప
UPDATED 2nd OCTOBER 2018 TUESDAY 6:00 PM
కాకినాడ: మహాత్మా గాంధీ చూపిన మహోన్నత మార్గం సర్వ కాలాలకు, సర్వ సమాజాలకు అనుసరనీయమని, ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఆయన ఆదర్శాలతో స్పూర్తి పొందారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక గాంధీనగర్ లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ. 3.86 కోట్లు నిధులతో ఆధునీకరించిన గాంధీ పార్కును మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని పార్కులోని జాతిపిత మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, సర్వమత ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గాంధీ మహాత్ముని శాంతి, సహనం, అహింస ఆదర్శాలే ప్రగతి శీల శ్రేయో సమాజ సాధనకు మార్గాలని తెలిపారు. అహింస, సచ్ఛీలతలతో కూడిన సమాజం కోసం గాంధీ మహాత్ముడు తపించారని, ఆయన కలలు గన్న ఆదర్శ భారత్ ను సాకారం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. జాతిపిత మహాత్ముని జీవితం, ఆదర్శాలను నేటితరం తప్పనిసరిగా తెలుసుకోవాలని మంత్రి కోరారు. అనంతరం ఆయన, శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, నగర మేయర్ సుంకర పావని, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలతో కలిసి గాంధీ పార్కులో అభివృద్ధి చేసిన పురుషుల జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్, గాంధీ స్మారక పైలాన్, రాజయోగ భవన్, ఫుడ్ కోర్టులు, ప్లే ఏరియా తదితర ఆకర్షణలను ప్రారంభించారు. గాంధీజీ పాద స్పర్శతో పునీతమైన పార్కును స్మార్ట్ సిటీ ప్రోజెక్ట్ ద్వారా సర్వాంగ సుందరంగా అత్యాధునిక హంగులతో ఆధునీకరించడం ముదావహమని, ఇందుకు జిల్లా కలెక్టర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే, మేయర్లు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్కులో యోగ, ధ్యాన సాధనల కోసం నిర్మించిన రాజయోగ భవన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున, జాయింట్ కలెక్టర్-2 సిహెచ్. సత్తిబాబు, నగర డిప్యూటీ మేయర్ కాళా బి.ఎస్.ఎస్. సత్తిబాబు, కార్పొరేటర్లు గోడి సత్యవతి వెంకట్, సుంకర లక్ష్మి ప్రసన్నసాగర్, మల్లిపూడి నాగ సూర్యదీపిక వీరు, మున్సిపల్ కమీషనర్ కె. రమేష్, ఎస్ఈ విజయకుమార్, పుర ప్రముఖులు పిల్లి సత్యన్నారాయణమూర్తి, సుంకర తిరుమలకుమార్, నున్న దొరబాబు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







