Updated 3rd January 2023 Tuesday 9:05 pm
CM Jagan : కొన్ని రోజులుగా ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటన చేయనుంది.
కొంతకాలంగా ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆనం. నాలుగేళ్ల పాలనలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు ఆనం. ముందస్తు ఎన్నికలకు వెళితే ఇంటికెళ్లడం ఖాయమన్నారు.
ఇలా పలు సందర్భాల్లో సొంత పార్టీ ప్రభుత్వం పైనే ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆనం చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఆనం వ్యాఖ్యలు ఇబ్బందికరంగా, పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆనంకు ఝలక్ ఇవ్వనుంది వైసీపీ హైకమాండ్. వెంకటగిరి ఇంచార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.







