UPDATED 12th AUGUST 2017 SATURDAY 5:00 PM
రాజమహేంద్రవరం/ ఉప్పలగుప్తం/అంబాజీపేట : సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం కోనసీమలో సందడి చేశారు. జిల్లాకు విచ్చేసిన ఆయనకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వాగతం పలికారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన ప్రతిష్ఠాపనా కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని ఏకధాటిగా పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి తన ఇష్ట దైవమని, ఆ భగవంతుడి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆ మహా నటుడి కుమారుడిగా జన్మించడం తన అదృష్టమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం అంబాజీపేట మండలంలోని పుల్లేటికుర్రు గ్రామంలో పర్యటించి అక్కడ ఉన్న చౌడేశ్వరి సమేత రామ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడ నుంచి రాజమండ్రికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.







