UPDATED 5TH MAY 2017 FRIDAY 11:45 PM
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై స్వయంభువుగా కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వేడుకగా, శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ద్వారకాతిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవాల శోభతో కళకళలాడుతోంది. ఆలయ పరిసరాలు శోభాయమానమై పులకిస్తున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం రంగురంగుల విద్యుద్దీప కాంతులతో వెలుగొందుతోంది. మొదటిరోజు శుక్రవారం సర్వాభరణ భూషితుడైన శ్రీనివాసుడు పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లు పెళ్లికుమార్తెలుగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అంతరాలయం పడమరవైపున ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి పూలదండలు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరులతో కూడిన శ్రీవారి ఉత్సవమూర్తులను ఉంచారు. వేద పండితులు, ఆలయ అర్చకులు స్వామివారిని పెళ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలను చేశారు. మంగళవాయిద్యాల మధ్య వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. దేవస్థానం కార్య నిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో కలిసి విశేష అలంకారంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించి తన్మయత్వం చెందారు. దర్శన క్యూల పక్కనే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించారు. కల్యాణ మహోత్సవాల్లో తొలిరోజున జరిగే గజవాహన సేవకు ఎంతో ప్రాధాన్యం ఉంది.గజ వాహనంపై ఆశీనులైన ద్వారకాధీశుడు క్షేత్ర పురవీధుల్లో ఊరేగి లోకానికి తన బలాన్ని చాటినట్లుగా రాత్రి వాహన సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మునగాల వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవం కనులపండువగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయానికి తూర్పువైపున ఉన్న శ్రీహరి కళాతోరణం వేదికపై నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించిన భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాబృందాలు అర్చిస్తూ, నర్తిస్తూ దేవదేవుని సేవలో లీనమవుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రాత్రి 7 గంటలకు ఋత్విగ్వరణ, మృద్గహణ, అంకురార్పణ, ధ్వజారోహణ, రాత్రి 9 గంటలకు హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, ఉదయం 10 గంటల నుంచి రోజంతా శ్రీహరి కళాతోరణం వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.







