విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి

* ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరావు

 UPDATED 1st DECEMBER 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): విద్యార్థి దశ నుండే ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ ఐ.  వెంకటేశ్వరరావు అన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో డాక్టర్ బి. చైతన్య శేఖర్ స్థానిక ప్రతిభ విద్యానికేతన్ పాఠశాలలో జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభ సభకు ఆదివారం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ప్రశ్నించే తత్వం మూలమని, ఆ తత్వమే అందరిలోని శాస్త్రీయ ఆలోచనలకు బీజం వేస్తుందని అన్నారు. విద్యార్థులకు ఏదన్నా సందేహం ఉంటే వాటిని తరగతి గదిలోనే నివృత్తి చేసుకోవాలని, అందరికీ విద్య, సమాన అవకాశాలు ఎందుకు లభించడం లేదో ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులు అలవాటు చేయాలన్నారు. నేడు సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలపై ప్రశ్నించే తత్వాన్ని విద్యార్ధులకు అలవాటు చేయాలన్నారు. అనంతరం జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్వీడన్ అమ్మాయి చేసిన పోరాటాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా జెవివి ఆధ్వర్యంలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం  పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం జెవివి జిల్లా కార్యదర్శి, మెజీషియన్ బుద్దా శ్రీనివాస్ రచించిన మ్యాజిక్-ల్యాజిక్ అనే పుస్తకాన్ని ఎంఎల్సీ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల  హత్యకు గురైన పశువైద్యాధికారిణి సంస్మరణ సభను జిల్లా కన్వీనర్ సిహెచ్ ఉమామంగతయారు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.హెచ్.పి. వర్మ, ప్రతిభ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఎస్.వి.వి.జి. ప్రకాష్, కోశాధికారి రామారావు, ఉపాధ్యక్షులు కెఎంఎంఆర్ ప్రసాద్, ఎన్. నారాయణ, వి.ఎస్.రెడ్డి, నానిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

ads