ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి కృషి

UPDATED 8th JULY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి కృషి చేయాలని పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, తదితర పాఠశాలల్లో విద్యార్థులకు సోమవారం ఆయన సైకిళ్ళు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు అన్నివసతులు కల్పించడం జరుగుతోందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు తదితర అన్ని సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం 8,9 తరగతుల విద్యార్థినులకు  సైకిళ్ళను ఆయన చేతుల మీదుగా అందచేశారు. అలాగే పట్టణ, మండల పరిధిలో సుమారు 1175 విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ జరిగినట్లు తెలిపారు. అలాగే పట్టణంలో పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాల్గొని సుమారు 5790 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, టిడిపి నాయకులు కంటే జగదీష్ మోహన్, అడబాల కుమారస్వామి, పాలకుర్తి శ్రీనుబాబు, కుర్రా నారాయణ స్వామి, అందుగుల జార్జి చక్రవర్తి, బడుగు శ్రీకాంత్, కాపవరపు కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీ నారాయణ, కాళ్ళ లక్ష్మీనారాయణ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్యనారాయణ, మున్సిపల్ కమీషనర్ కె. నాగేంద్రకుమార్, మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, మండల విద్యాశాఖాధికారి వైవి శివరామ కృష్ణయ్య, మున్సిపల్ సిబ్బంది శ్రీహరి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ads