అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

* అగ్నిమాపక శాఖాధికారి ఏసుబాబు 
* ఘనంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం

UPDATED 14th APRIL 2019 SUNDAY 9:00 PM

పెద్దాపురం: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా యువత ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని అగ్నిమాపక శాఖాధికారి బంగారపు ఏసుబాబు అన్నారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం వద్ద ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్దాపురం అగ్నిమాపక శాఖాధికారి బంగారపు ఏసుబాబు వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల విషయమై అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు, ముఖ్యంగా వేసవిలో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రతను తగ్గించడం, బాధితులను రక్షించే విషయంలో యువకులు సహాయ సహకారాలను అందించాలన్నారు. ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక శాఖ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads