జటాజూటం అలంకారంలో భీమేశ్వరస్వామి

* భక్తులతో కిటకిటలాడిన పంచారామ క్షేత్రం 
* అలరించిన వీరభద్రుని సంబరం

UPDATED 27th NOVEMBER 2019 WEDNESDAY 10:00 PM 

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోటలో గల  ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీచాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి జటాజూట అలంకారంలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్త సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని వెండి జటాజూటం, పట్టువస్త్రాలు, బాలా త్రిపుర సుందరీదేవిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 11 గంటల వరకు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నెలరోజుల పాటు పండుగ వాతావరణంలో కొనసాగిన కార్తీకమాస ఉత్సవాలు బుధవారంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద  ఏర్పాటు చేసిన వీరభద్రుని సంబరం భక్తులను ఎంతగానో అలరించింది. వీరనాట్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. స్వామి, అమ్మవార్లను అనపర్తి ఎంఎల్ఏ సత్తి సూర్యనారాయణరెడ్డితోపాటు అమలకంటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ మట్టపల్లి రమేష్ భక్త సంఘం, అన్నదాన ట్రస్టు సభ్యులు,దీపారాధన సేవా సంఘం సభ్యులు భక్తులకు సేవలందించారు. ఆలయ పండితులు శ్రీపాద రాజశేఖర శర్మ, కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, వెంకన్న, లక్ష్మణ్ చెరుకూరి రాంబాబు, భీమన్న స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్థానిక ఎస్ఐ సుమంత్ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

 

ads