మట్టి తవ్వకాలపై రైతులు ఆందోళన

* తవ్వకాలు అడ్డుకున్న రైతులు
* తహసీల్దార్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం

UPDATED 19th MARCH 2020 THURSDAY 8:30 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్థానిక ఎడిబిరోడ్డులో ఉన్న పెద్దపులి చెరువు (తిమ్మరాజు చెరువు)లో  మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకున్న రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చెరువు సమీపంలో గల రైతులు ముళ్ళపూడి రాంబాబు, కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, తదితరులు మాట్లాడుతూ మట్టి తవ్వకాలకు సంబంధించి సరిహద్దు రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా కాకినాడకు చెందిన సుధాకర్ ఇన్ఫో కంపెనీ తవ్వకాలు చేపట్టారని అన్నారు. గతంలో ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టడం వల్ల ఇప్పటికే లోతు పెరిగి పశువులు ప్రమాదానికి గురయ్యాయని, ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు చేపట్టడం ఏంటని వారు  ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దారుకు ఫోన్ ద్వారా వారు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రదేశానికి సర్వేయర్, వీఆర్వోలు హుటాహుటిన చేరుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ జితేంద్రను వివరణ కోరగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్డీవో ప్రొసీడింగ్స్ ప్రకారం మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న సంస్థ సిబ్బంది సంబంధిత రైతులతో మాట్లాడి పనులు చేపట్టాలని తెలిపారు. పొలాలు తాలూకు రైతులు తమ దస్తావేజులతో కార్యాలయానికి రావాలని తహసీల్దార్ కోరడంతో వివాదం సద్దుమణిగింది.     

ads