పౌర సేవల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు:జేసీ రాజకుమారి

సామర్లకోట, 17 సెప్టెంబర్ 2020(రెడ్ బీ న్యూస్): సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో అలసత్వం వహిస్తే సహించేదిలేదని జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సామర్లకోట అర్బన్ కు సంబంధించి 20, 21 వార్డులలో ఉన్న 10వ సచివాయాన్ని జెసి (డబ్ల్యూ) రాజకుమారి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు సచివాలయ సిబ్బంది పనితీరును, వాళ్ళు అందించే సేవలను జెసి పరిశీలించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల వివరాల ప్రదర్శన బోర్డులు, సచివాలయం రికార్డులను పరిశీలించారు. జేసీ ఈ తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో లోన్ నిమిత్తం సచివాలయానికి వచ్చిన దరఖాస్తుదారునితో మాట్లాడారు. ఏ లోన్ నిమిత్తం సచివాలయానికి వచ్చారని, ఆ లోన్ ను తిరిగి చెల్లించే విధానం, డిజిటల్ పేమెంట్స్ పై అవగాహన తదితర వివరాలను ధరఖాస్తుదారున్ని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడకు వెళ్లినా తప్పనిసరిగా ముక్కు, నోటిని కప్పే విధంగా మాస్కు ధరించాలని, ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా కరోనా సోకే ప్రమాదం ఉందని అన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందేలా సిబ్బంది పనిచేయాలని ఆమె తెలిపారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, డీఈ రామారావు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ads