వరద ఉధృతి ప్రాంతాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్

UPDATED 15th SEPTEMBER 2020 TUESDAY 6:00 PM

ఏలేశ్వరం (రెడ్  బీ న్యూస్): అల్పపీడన ప్రభావంతో గతః నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా స్థాయికి మించి నీరు చేరిన ఏలేరు జలాశయం, కృంగిపోయిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి  ప్రత్తిపాడు ఎమ్మెల్యే  పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి స్థాయిని మించి నీరు చేరడంతో గత రెండు రోజులుగా నీటిని క్రిందకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏలేరు పరివాహక ప్రాంత మండలాలకు సంబంధించిన పల్లపు ప్రాంతాలు, పంట భూములు నీట మునిగాయని అధికారులు తెలిపారు. ఏలేరు ప్రాజెక్టు ఈఈ నరసింగరావు ప్రాజెక్టు నిల్వల గరిష్ట స్థాయి, మెయింటైనెన్స్, నీటి ఇన్ ఫ్లో సమాచారాన్ని కలెక్టర్ కు వివరించారు. ఏలేరు వరద తాకిడికి కృంగిపోయిన బ్రిడ్జి అప్పనపాలెం, మామిడాడ, నరేంద్ర పట్నం గ్రామాల ప్రజల రాకపోకల నిమిత్తం 2001లో నిర్మాణం జరిగినట్లు ఎంఎల్ఏ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. బ్రిడ్జి మీద ఎలాంటి రాకపోకలు లేకుండా చూడాలని, బారికేడ్లు నిర్మించి అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమాచారాన్ని తెలియజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్శనలో పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఏలేరు పెద్దాపురం డివిజన్ డిఈ రామ్ గోపాల్, ఏలేరు ప్రాజెక్టు డిఈ ఆనంద్, జెఈ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

ads