ఓట్లు తొలగింపు వదంతులు నమ్మవద్దు

UPDATED 10th MARCH 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: ఓట్ల తొలగింపు వదంతులు ఎవరూ నమ్మవద్దని జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. ఆదివారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కలెక్టర్ జవాబిస్తూ ఫారం-7 ద్వారా ఓట్లు తొలగించే హక్కు జిల్లా కలెక్టరుకు గాని, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లకు గానీ లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల అధికారి పరిధిలో జిల్లా కలెక్టర్లతో పాటు, అన్ని శాఖల అధికారులు పని చేస్తున్నారని చెప్పారు. ఫారం-7 దరఖాస్తులు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నారని, ఈ దరఖాస్తులను ఓటర్లకు తెలియకుండా వారి ఓటును తొలగించేది లేదన్నారు. ఫారం-7పై వచ్చిన దరఖాస్తులపై విఆర్వో, పంచాయతీ కార్యదర్శి, బిఎల్ వోలతో విచారణ చేపట్టి, వారి నివేదికను ఎన్నికల కమీషన్ కు పంపిన తరువాత వారు పరిశీలించి దానిపై తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. తప్పుడు ఫారం ప్రక్రియకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నప్పటి నుంచి ఓట్ల తొలగింపు కోసం వచ్చే ఫారం-౭ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. జిల్లాలో 45 వేలు ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8ఎ వచ్చాయని, వీటిలో 20 వేల ఓటర్ల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా ఫారం-6 దరఖాస్తులు వస్తున్నాయని, ప్రజాస్వామ్యంపై నమ్మకంతో యువత ఫారం-6 దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు.

 

ads