నాసిరకంగా పెద్దాపురం - జె. తిమ్మాపురం రహదారి నిర్మాణ పనులు

* కొరవడిన ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణ
* ఇష్టారాజ్యంగా రహదారి నిర్మాణం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్
* నిబంధనలకు పాతర
* ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీలో జరుగుతున్న పనులు
* కనీస రక్షణ చర్యలు చేపట్టకుండానే రహదారి నిర్మాణం
* రాత్రి సమయాల్లో హడావిడిగా నిర్మాణ పనులు
* పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు

UPDATED 15th NOVEMBER 2020 SUNDAY 5:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): నాగరికతకు చిహ్నాలుగా చెప్పుకునే రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ కొందరు అధికారులు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ప్రజా ధనాన్ని దోచుకు తింటున్నారు. పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చి నాసిరకం పనులతో దోపిడీకి తెర తీశారు. కొందరు అధికారులు దీనికి వత్తాసు పలికి కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాణ్యతలో రాజీ పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దాపురం పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీ నుంచి జె. తిమ్మాపురం జంక్షన్ వరకు ఆరు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రోడ్డుగా విస్తరించేందుకు రూ.ఆరు కోట్లు సీఆర్ఎఫ్ నిధులతో పనులను చేపట్టారు. అయితే పనులు చకచకా జరుగుతున్నట్లు పైకి కనిపిస్తున్నా అందులో నాణ్యత ఏమాత్రం లేదనే విమర్శలున్నాయి. పైగా కొందరు ఉన్నతాధికారులు సైతం కుమ్మక్కయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా పెరగడంతో రహదారి పూర్తిగా ఛిద్రం అయింది.  అలాగే  ఇరుకుమయంగా ఉండటంతో పలు ప్రమాదాలు నిత్యం సంభవిస్తుండడంతో ప్రభుత్వం ఈ డబుల్ లైన్ రహదారిగా విస్తరించేందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో రహదారి నిర్మాణం పనులను ఇటీవల ప్రారంభించారు..
అడుగడుగునా నిర్లక్ష్యం
ఈ రహదారి నిర్మాణంలో అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. రహదారి నిర్మాణం చేపట్టే కాంట్రాక్టర్ కనీసం రక్షణ చర్యలను పూర్తిగా విస్మరించడంతో పలు ప్రమాదాలు జరుతున్నాయి. ఈ రహదారి నిర్మాణం సమయంలో నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏమీ తీసుకోకపోవడంతో నిత్యం పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రహదారిలో సుమారు 11 కల్వర్టులని విస్తరించాల్సి ఉంది. కల్వర్టు నిర్మాణ సమయంలో చుట్టూ పని జరిగే ప్రదేశంలో కాంట్రాక్టర్ రక్షణ చర్యలు చేపట్టాలి. కానీ అది ఎక్కడా అమలు జరగడం లేదు. దీంతో నిత్యం ఈ రహదారిలో వాహన చోదకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. అలాగే రోడ్డు విస్తరణ చేసే ప్రాంతాల్లో కనీసం శాండ్ బిన్స్, రెడ్ రిబ్బన్స్  కూడా ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి సమయంలో పలువురు ఎక్సావేషన్ చేసిన గోతుల్లో పడి గాయాలపాలు అవుతున్నారు.   
నాణ్యతను పాతర
ఇక రహదారి నిర్మాణంలో నాణ్యతను పూర్తిగా పాతర వేసేశారు. ఎక్కడా కూడా రహదారిని నాణ్యతగా నిర్మించడం లేదని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా రహదారి విస్తరణకు సంబంధించి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా రహదారి నిర్మాణం పనులు చేపడుతున్నట్టు తెలుస్తోంది. రహదారి విస్తరణ సమయంలో మెటల్ వేసి రోలింగ్ చేసి దానిపై వెట్ మిక్స్ వేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. నేరుగా వెట్ మిక్స్ ను అధిక శాతం స్టోన్ డస్ట్ (రాతి పొడి) కలిపి తక్కువ శాతం మెటల్ తో నిర్మాణం పనులు చేపట్టడంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే వెట్ మిక్స్ లో తేమ శాతం కూడా లేకుండా పౌడర్ రూపంలో వేసి రోలింగ్ చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఇక క్యూరింగ్ చేస్తున్న దాఖలాలు అక్కడ కనిపించడం లేదు. దీంతో రహదారి నాణ్యతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ రహదారి మీదుగా భారీ వాహనాలు వెళితే రోడ్డు కిందకు కుంగిపోయే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. పైగా పైపైనే ఎక్సావేషన్ చేసేసి దానిపై స్టోన్ డస్ట్ వేసి రోలింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. అలాగే నిబంధనల ప్రకారం విస్తరణ సమయంలో భూమిని కిందకు తవ్వడం, అలాగే విస్తరణలో మెజర్ మెంట్ విషయంలో కర్ర పుల్లల సహాయంతో కొలతలు తీసున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల రహదారిని సాదాసీదాగా నిర్మాణ పనులు చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
హడావిడిగా రాత్రి పూట పనులు
అధికారుల పర్యవేక్షణలో పగటిపూట మాత్రమే పనులు చేయాల్సి ఉండగా, ఆదరాబాదరగా రాత్రి సమయంలో పనులు చేస్తున్నారు. దీంతో ఇంత హడావిడిగా రాత్రి సమయంలో పనులు చేపట్టడం చూస్తుంటే రహదారి నాణ్యతపై అనుమానం కలగక మానడం లేదు. పైగా పలు ప్రమాదాలు జరిగి వాహన చోదకులు గాయాలపాలు అవుతున్నారు.
కొరవడిన ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణ
రహదారి నిర్మాణం సమయంలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో రహదారి నాణ్యత ప్రశ్నార్థకంగా  మారింది. సుమారు ఆరు కిలోమీటర్ల మేర విస్తరిస్తున్న ఈ రహదారి విషయంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే నిర్మాణ సమయంలో ఆర్ అండ్ బీ ఇంజనీర్లు  పూర్తిస్థాయిలో దగ్గర ఉండి రహదారి నిర్మాణం పనులను పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. కానీ ఇది ఎక్కడా అమలు జరగడం లేదు. పైగా పని ప్రదేశంలో ఆర్ అండ్ బీ అనధికారికంగా నియమించిన ప్రైవేటు వ్యక్తులు పర్యవేక్షణలో పనులు చేస్తూ రహదారి నిర్మాణం పనులు కానిచ్చేస్తున్నారు. రహదారి విస్తరణకు సంబంధించి నాణ్యత విషయంపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసే యోచనలో పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి రహదారి నాణ్యతకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

 

ads