తహసీల్దార్‌ను సజీవదహనం చేయడం అమానుషం

* నల్లబ్యాడ్జీలతో రెవిన్యూ ఉద్యోగులు విధులకు హాజరు
* తహసీల్దార్‌ హత్యపై నిరసన

UPDATED 5th NOVEMBER 2019 TUESDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని సజీవదహనం చేయడం అమానుషమని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పిలుపు మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద మంగళవారం రెవిన్యూ ఉద్యోగులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తహసీల్దార్‌ హత్యను నిరసిస్తూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవిన్యూ ఉద్యోగులు మాట్లాడుతూ తహసీల్దార్‌ విజయారెడ్డి మరణం జీర్ణించుకోలేనిదని, దుండగుడు తన కార్యకలాపాల కోసం ఆమెను సజీవ దహనం చేయడం అమానుషమని పేర్కొన్నారు. తహసీల్దార్‌ను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు టి. కృష్ణారావు, కార్యదర్శి భానుకుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కుమార్, ఆర్డీవో కార్యాలయం ఏవో చిన్నారావు, తహసీల్దార్ కోనాడ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

 

ads