ఏలేరు ఆధునికీకరణకు ప్రభుత్వం సన్నద్ధం:జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

సామర్లకోట,15 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): ఏలేరు ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్దంగా ఉందని, కొద్దిరోజుల్లో ఇంజనీరింగ్ ఈఎంసీ అధికారులు ప్రాజెక్ట్ ను పరిశీలీనిచనున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. సామర్లకోట పట్టణ పరిధిలో ఏలేరు జలాల ఉధృతి కారణంగా సాయంత్రం ఆయన ముంపు ప్రాంతాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 9 నుంచి 11వరకు భారీ వర్షాలు కురిశాయని, ఏలేరు ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ నీటిమట్టం పెరగడంతో వరి, ఉద్యాన పంటలు ముంపునకు గురయినట్లు పేర్కొన్నారు. బుధవారం 20 వేలు, గురువారం 14 వేల క్యూసెక్కుల నీటిని దిగు వకు విడిచిపెట్టగా శుక్రవారం సాయంత్రం నాటికి ముంపు సమస్య కొంతమేర తగ్గింది. ఇప్పటికే జిల్లాలో 1600 హెక్టార్లలో ఉద్యాన పంటలు, అధిక విస్తీర్ణంలో వరి పంట ముంపులోనే ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో ముంపు సమస్య పూర్తిగా తొలగిపోగలదన్నారు. 200 గృహాలకు పాక్షికంగా నష్టం ఏర్పడిందన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి 3 వేల మందిని, గ్రామీణ ప్రాంతాల నుంచి 6 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. జిల్లాలో పంట నష్టాలను పరిశీలించేదుకు రాష్ట్రస్థాయి శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు రెండు రోజులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. అంతకుముందు బ్రౌన్ పేట రోడ్డులో శివారు ఏలేరు జలాలతో ముంపులో ఉన్న ప్రాంతాలను ఆయన సందర్శించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో చిన్నికృష్ణ, తహశీల్దార్ వజ్రపు జితేంద్ర, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు తదితరులు ఉన్నారు.
ads