లీకుల సమస్య తీరేదెన్నడో....

* పట్టణంలో ఎక్కడికక్కడే నీటి వృధా
* ఇలా అయితే వేసవిలో తాగునీటి సరఫరా కష్టమే
* స్పందించని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు

UPDATED 11th FEBRUARY 2020 TUESDAY 5:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ ప్రజలను గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్యల్లో తాగునీటి సరఫరా ఒకటనేది వాస్తవం. దీనితో పాటు పైపులైన్లు లీకుల వల్ల తాగునీరు  వృధా అవుతుండడమే కాకుండా కలుషితం అవుతోంది. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు
పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది మున్సిపల్ అధికారులు వచ్చి వెళ్లినా తాగు
నీటి లీకుల సమస్యకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు చేయకపోవడం విచారకరం. లీకుల సమస్య తీవ్రతరం కావడంతో పట్టణ ప్రజలు భవిష్యత్తులో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

పరిష్కారమే లేదా..?
పెద్దాపురం పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి 100 ఏళ్లు పైబడింది. అలాగే పైపు లైన్లు వేసి సుమారు 60 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి అవే పైపులైన్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా లీకులే దర్శనిమిస్తున్నాయి. పట్టణంలో సుమారు 29 వార్డులు ఉన్నాయి. కాలం చెల్లిన పైపులైన్లతోనే నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో నిత్యం లీకులు పడుతుండడంతో తాగునీరు వృధాగా పోతోంది. ఇటీవల పట్టణంలో లీకుల సమస్య అధికమయ్యింది. పైగా లీకుల మరమ్మతుల పేరుతో లక్షల్లో ప్రజాధనం వృధా అవుతోంది. అయినా ఫలితం ఉండటం లేదు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఈ విషయంలో ఏమీ పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై పలు ప్రజా సంఘాలు, ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో పరిస్థితి దుర్భరంగా తయారయ్యింది.
వేసవిలో తాగునీటి సరఫరా కష్టమే..
ప్రధాన పైపులైన్లకు లీకులు ఏర్పడడంతో తాగునీరు వృధాగా పోవడంతో పాటు, ఎక్కడిక్కడే కలుషితం
అవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే వేసవిలో పట్టణంలో ఉన్న 29 వార్డుల జనాభాకు తాగునీరు అందే పరిస్థితి కనిపించేలా లేదు. ఇప్పటికే పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ, నాగమ్మపేట, సత్తిరెడ్డిపేట, రాజా కాలనీ, సత్తెమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాలు గుక్కెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. లీకుల సమస్యపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోతే ఏప్రియల్, మే నెలల్లో పట్టణ ప్రజలు దాహంతో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు లీకులకు సంబంధించి అప్రమత్తం అయితే పట్టణ ప్రజలు వేసవిలో నీటి సమస్య నుంచి బయటపడతారు.

 

ads