వలస కార్మికులను తరలించేందుకు చర్యలు: ఆర్డీవో మల్లిబాబు

పెద్దాపురం,11 మే 2020(రెడ్ బీ న్యూస్):డివిజన్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన 975 మంది ఇతర జిల్లాలు,రాష్ట్రలకు చెందిన వలస కార్మికులు,ఇనిస్ట్యూట్ లో పనిచేస్తున్న వ్యక్తులను వారి స్వస్థలాలకు తరలివెళ్లేందుకు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. స్థానిక విలేఖరులతో ఆయన సోమవారం మాట్లాడారు. డివిజన్లో 975 మంది వలస కార్మికులు నమోదు చేసుకోగా వారిలో ఒడిశాకు చెందిన 92 మంది ఝార్ఖండ్ కు చెందిన 12 మందిని ఆదివారం వారి సొంత ఖర్చులతో ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించడం జరిగిందన్నారు.మిగిలిన వారు జిల్లాకు,రాష్ట్రాలకు తక్కువగా ఉన్నందున వారికి రైల్వే శాఖ కేటాయించిన రైళ్ళలో వారి సొంత ఖర్చులతో త్వరలో పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు.విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి మన జిల్లాకు వచ్చేవారు స్పందన ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రత్యేక విమానం హైదరాబాద్ చేరుకుంటుందని వీటిలో మన జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారని తెలిపారు.ఇతర రాష్ట్రాలు,విదేశాల నుంచి వచ్చే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నవరం, బొమ్మూరు,రావులపాలెం, రాజోలు క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజులు ఉంచడం జరుగుతుందని,అనంతరం వారి స్వగ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్, హాస్టళ్లలో, కమ్యూనిటీ క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజులు ఉండవలసి ఉంటుందని తెలిపారు. అనంతరం వారి ఇళ్లకు పంపడం జరుగుతుందని తెలిపారు ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రభుత్వం గుర్తించిన హోటళ్లలో సబ్సిడీ రేట్లపై పెయిడ్ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండవచ్చని ఆర్డివో తెలిపారు వీరిని కూడా 14 రోజులు అనంతరం వారి స్వగృహంలకు పంపడం జరుగుతుందని చెప్పారు.
ads