రెవిన్యూలో వసూల్ రాజా

* పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి దందా..
* ప్రతీ పని ఓరేటు ఫిక్స్
* తొమ్మిదేళ్లుగా అక్కడే తిష్ట
* వెళ్లినా తిరిగి మళ్లీ డిప్యూటేషన్ల పేరుతో వెనక్కి
* క్రిందిస్థాయి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు
* తాను చెప్పిన పని చేయాలంటూ హుకుం
* సహకరిస్తున్న ఓరెవెన్యూ ఉన్నతాధికారి

UPDATED 9th SEPTEMBR 2019 MONDAY 11:00 AM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్ ప్రతినిధి) : పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి వసూల్ రాజాగా అవతారమెత్తి కార్యాలయంలో అంతా తానై చక్రం తిప్పుతున్నాడు. తొమ్మిదేళ్లుగా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుని ఫెవికాల్ వీరుడి పేరును సార్థకం చేశాడా అధికారి. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడంలో ఆయన దిట్ట. చాలా ఏళ్లుగా ఇక్కడే ఉద్యోగం చేస్తుండడంతో ఆయనకు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు బలపడ్డాయి. అలాగే ఆయన రెవెన్యూ అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరిస్తూ మరిన్ని అక్రమాలకు తెరతీసినట్టు సమాచారం. ఏకంగా ఆయన వసూళ్ల దందా రూ. లక్షల్లో ఉంటాయంటే దానినిబట్టి ఆయన ఏస్థాయిలో బరితెగిస్తున్నాడో తెలుస్తుంది. కార్యాలయంలో ప్రతీ పనికీ ఆయన ఓరేటును నిర్ణయించేశాడు. ఆయన అడిగింది ఇవ్వకపోతే ఫైల్ కి కొర్రీలు వేసి ఏవేవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వచ్చిన వారికి చుక్కలు చూపిస్తాడు. దీంతో చేసేది ఏమీలేక ఆయన ఆడిగింది ముట్టచెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవేళ ముట్టచెప్పినా పని చేస్తాడా అంటే నాన్చుడు వ్యవహారం. ఈ వసూళ్ల దందా విషయంపై గతం నుంచి ఆయనపై పలు ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఆయనకు అదే శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఉన్నతాధికారే ఇప్పటికీ ఈయనకు సహకారం అందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది దీంతో ఆయన ఆక్రమాలకు అంతులేకుండా పోయింది. తొమ్మిదేళ్లుగా కార్యాలయంలోనే పాతుకుపోయాడు. ఒకవేళ బదిలీపై వెళ్లినా మళ్లీ డిప్యూటేషన్ పేరుతో ఇక్కడకి వచ్చేయడం ఆయనకు అలవాటుగా మారింది. నిజానికి నిబంధనల ప్రకారం స్థానికుడు అయిన వ్యక్తి సొంత మండలంలో ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు, కానీ ఆయనకు ఆవేమి వర్తించవు. పైఅధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన అక్కడే ఆసీటుకు అతుక్కుపోయారు. దీంతో అన్ని విషయాలు తెలిసిన ఆయన అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి తిష్ట వేయడం కారణంగా ఆయన మరిన్ని అక్రమాలకు తెగబడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆయన చెప్పిన పనులు కార్యాలయంలో పనిచేసే క్రిందిస్థాయి ఉద్యోగులు చేయకపోతే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో పాటు, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు పెట్టించి మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులే వాపోతున్నారు.
లక్షల్లో వసూళ్ళు 
కార్యాలయానికి వచ్చే వారికి ఈయన మీడియేటర్ లా వ్యవహిస్తుంటాడు. రెవెన్యూకు సంబంధించి పాస్ బుక్స్ జారీ, భూములు ఆన్ లైన్, ల్యాండ్ కన్వర్షన్, పొజిషన్ సర్టిఫికెట్లు జారీ, డి పట్టాలు మంజూరు, భూములు సర్వే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ పనికీ ఆయన ఓరేటు ఫిక్స్ చేసేశాడు. అలాగే గత ప్రభుత్వ హాయాంలో పట్టాలు మంజూరు విషయంలో కూడా పెద్దస్థాయిలో అవినీతికి పాల్పడినట్లు సమాచారం. పట్టా ఒక్కింటికీ రూ.25 వేల చొప్పున వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెద్దాపురం మండలంలో ఓ గ్రామంలోని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ జరగకుండా ఆ గ్రామానికి చెందిన కొంతమంది స్థానిక నాయకుల సహకారంతో లబ్ధిదారులకు పట్టాలు మంజూరు కాకుండా అడ్డుపడేందుకు శతవిధాలా ప్రయత్నం చేశాడు. ఇందుకోసం రూ.లక్ష వరకూ తీసుకుని ఆపని కాకపోవడంతో తిరిగి మళ్లీ డబ్బులు వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. ఇక భూములు ఆన్ లైన్ విషయానికి వస్తే ఆయనకు పండగే. ఇప్పటివరకూ ఎంతమంది వద్ద నుంచి వసూలు చేశారనడానికి లెక్కే ఉండదు. ఒకవేళ ఎవరైనా భూములు ఆన్ లైన్ కోసం వస్తే ఎకరానికి రూ.మూడు వేల నుంచి రూ.పది వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భూయజమానులకు ఏవేవో సాంకేతిక కారణాలు సాకుగా చూపి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వసూలు చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే వాళ్లని కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటాడు. ఆయన ఆడిగిన సొమ్ములు ఇవ్వకపోతే సంబంధిత వ్యక్తులకు చుక్కలు చూపిస్తాడు. ఇక భూములు సర్వే కోసం ఎవరైనా వస్తే ముందుగా ఈయననే కలవాలి. ఆయన చెప్పిన సొమ్ములు ఇస్తేనే సర్వే ఫైల్ ముందుకు కదులుతుంది. లేకపోతే మూలకు చేరుతుంది. పెద్దాపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో వెలసిన లేఅవుట్లకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ పేరుతో ఆయా రియల్టర్లు నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైఅధికారులకు ఇవ్వాలంటూ వారి నుంచి వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఇటీవల రెవెన్యూ అధికారులు అర్థరాత్రి సమయంలో రామేశంమెట్ట వద్ద జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై మెరుపుదాడులు చేసి 12 లారీలు, రెండు జేసీబీలను సీజ్ చేశారు. వాటిని తాను విడిపించే ఏర్పాటు చేస్తానని సదరు లారీ యజమానులకు హామీ ఇచ్చారని, ఇందుకోసం తనకు భారీగా ముడుపులు ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది.
కార్యాలయంలోనే సెటిల్ మెంట్లు
ఆయన చేసే అవినీతికి తహసీల్దార్ కార్యాలయాన్నే అడ్డాగా చేసేసుకున్నాడు. రాత్రి పది గంటల వరకూ కార్యాలయంలోనే ఉంటూ సంబంధిత వ్యక్తులను అక్కడికే పిలిపించుకుని వారితో మాట్లాడుకుని సెటిల్ మెంట్లు చేసుకోవడం చూస్తుంటే ఆయన ఏస్థాయిలో బరితెగిస్తున్నాడో అర్థమవుతోంది. కార్యాలయం సెలవు రోజుల్లో కూడా వచ్చి ఈతతంగం నడిపిస్తుంటాడు. పైగా సెలవు రోజుల్లో తాను నిజాయితీగా పని చేసుకుంటున్నట్లు ప్రజలకు బిల్డప్ ఇస్తుంటాడు. తహసీల్దార్ కార్యాలయంలో అంతా ఆయనే అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటాడు. గతంలో పెద్దాపురంలో పనిచేసి ప్రస్తుతం ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లిన రెవెన్యూ శాఖలో గల ఒక ఉన్నతాధికారి ఈయనకు ఇప్పటికీ సహకరిస్తునట్లు సమాచారం. అలాగే జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ద్వారా ఇటీవల జరుగుతున్న సాధారణ బదిలీల్లో బదిలీ కాకుండా ఆ అధికారే ఈయనకు రికమెండ్ చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సాకుగా చూపి ఇక్కడ తిష్ట వేసి కూర్చునట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరిన్ని అక్రమాలకు తెరలేపి రెవిన్యూ శాఖతో పాటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తీసుకువచ్చే అవకాశం ఉందని పలువురు ఈ అధికారి కోసం చర్చించుకుంటున్నారు.

ads