కార్మికులను అదుకోవాలంటూ సీఐటీయూ నిరాహార దీక్ష

సామర్లకోట,28 ఏప్రిల్ 2020,(రెడ్ బి న్యూస్):సీఐటీయూ సామర్లకోట మండల కమిటీ కార్మికుల సమస్యలపై మండల కార్యాలయం వద్ద భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో నిరాహారదీక్ష ను సీఐటీయూ సీనియర్ నాయకులు కరణం ప్రసాదరావు బుధవారం ప్రారంభించారు.ఈదీక్షలో సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి టి.నాగమణి, ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్, ఎన్.సురేష్, ఎం.వి.రమణమ్మ, బాలం సత్తిబాబు, కరణం రామకృష్ణ పాల్గొన్నారు. కార్మిక సమస్యలపై తహసీల్దార్, మునిసిపల్ కార్యాలయాలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణకై లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కార్మిక,ఉద్యోగ వర్గాలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. వారందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. అసంఘటిత రంగ,వలస కార్మికుల దినసరి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, వివిధ ప్రభుత్వ పథకాల ఉద్యోగుల సమస్యలను సానుభూతితో పరిశీలించి,మానవత్వంతో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదన్నారు. ఆదిశగా ఆలోచించి సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.కోవిడ్ విధుల్లో ఉన్న మున్సిపల్, పంచాయితీ, వైద్య, ఆరోగ్య, 108, గ్రామ, వార్డు సచివాలయ, పోలీసు, హెమ్ గార్డు, ఆశా, రెవెన్యూ తదితర విభాగాల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ ఒక నెల గ్రాస్ వేతనం అదనంగా చెల్లించాలన్నారు. రిస్క్ అలవెన్సు చెల్లించాలని, వీరికి అవసరమైన సంఖ్యలో మాస్కూలు, గ్లవుజులు, రక్షణ పరికరాలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏ కార్మికులని తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్ కాలంలో వేతనాలను చెల్లించాలని, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన యాజమాన్యాలను శిక్షించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలని, వివిధ ప్రభుత్వ శాఖల్లోని బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. వలస కార్మికులు వారి ప్రాంతాలకు చేర్చాలన్నారు. ఈలోగా లాక్ డౌన్ కాలంలో వారి కుటుంబ పోషణకు అవసరమైన అన్ని ఆహార పదార్థాలు, ఆర్ధిక సహాయం అందించాలన్నారు. వారికి నివాస ఏరాట్లు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుండి రూ.10 వేలు ప్రతీ కార్మికునికి చెల్లించాలని, లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్టు, హమాలీ, వెండార్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులందరికీ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. రెడ్ జోన్స్ లోని పేద వారందరికీ ఉచితంగా నెలకు సరిపడా అన్ని ఆహార పదార్ధాల సరఫరా, ఆర్థిక సహాయం అందించాలన్నారు. పని గంటలను 8 గంటలకు మించి పెంచరాదని,రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి వ్యవసాయ ఖర్చులు, రవాణాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు.ఉపాధి హామీ కార్మికులకు ఏడాదిలో 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఆర్ధిక సహాయం, రుణాలు అందించాలన్నారు.స్వయం సహాయక గ్రూపులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, గృహ హింస నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు బర్ల గోపాల్, నాయకులు తుంపాల శ్రీనివాస్,ప్రకృతి ఈశ్వరరావు, కరణం గోవిందరాజు,కరణం సత్యనారాయణ, చిట్టిడి శ్రీను,పాల్గొన్నారు.
ads