ఆర్&బీ ఏమిటిదీ..?

* పెద్దాపురం -జె.తిమ్మాపురం రహదారి నాణ్యత పట్టని అధికారులు
* మళ్లీ అదే తీరుతో వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్
* పర్యవేక్షణ మాటే మరిచిన అధికారులు
* రాత్రి సమయంలో యథేచ్ఛగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు

UPDATED 18th NOVEMBER 2020 WEDNESDAY 10:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం పెద్దాపురం నుంచి జె. తిమ్మాపురం వరకు సుమారు రూ.6 కోట్లు సిఆర్ఎఫ్ నిధులతో డబుల్ లైన్ గా విస్తరిస్తున్న రహదారి విషయంలో ఆర్&బి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రహదారి నాణ్యతపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో దర్యాప్తు చేయించాలని పలువురు డిమాండ్ సైతం చేస్తున్నారు. దీంతో రహదారి నిర్మాణంలో లోపాలు బహిర్గతమయినట్లయ్యింది.
మొద్దునిద్రలో ఆర్&బీ అధికారులు
రహదారిని నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఆర్&బీ అధికారులు మొద్దునిద్రలో ఉంటున్నారని పలువురు వారి తీరుని బహిరంగంగా విమర్శిస్తున్నారు. రహదారి నిర్మాణంలో రాతిపొడి మిశ్రమం (స్టోన్ డస్ట్) అధిక శాతం కలిపి రహదారిని నాసిరకంగా నిర్మిస్తున్నారని తెలిసినా అధికారులకు ఏమీ పట్టడంలేదు. పైగా ఏమాత్రం రహదారి నిర్మాణంలో అనుభవంలేని వ్యక్తిని ఆర్&బీ అనధికారికంగా పర్యవేక్షణ నిమిత్తం నియమించింది. దీంతో రహదారి నాణ్యతను గాలికి వదిలేసినట్టియ్యింది.
రక్షణ చర్యలు విషయంలోనూ అదే నిర్లక్ష్యం
ఈ రహదారి నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్ అదే నిర్లక్ష్యం వహిస్తున్నా అధికారులు ఎందుకు అంత మెతక వైఖరిని అవలంభిస్తున్నారో 
తెలియడంలేదు. ఇప్పటికే రహదారిలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదాల బారిన పడి గాయలపాలయ్యారు. ఏదో మొక్కుబడి చర్యలతో సరిపెడుతూ నిర్మాణ పనులను ఇష్టానుసారం చేపడుతున్నారు. కానీ అధికారులకు ఇవేమీ పట్టడంలేదు. ప్రజల ప్రాణాలతో ఓ వైపు అధికారులు, మరోవైపు కాంట్రాక్టర్ ఆడుకుంటున్నారు.  ప్రమాదవశాత్తూ ఎవరైనా విస్తరణ పనులకు తీసిన ఎక్సావేషన్ గోతుల్లో పడి మృతి చెందితే బాధ్యత ఎవరు వహిస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాగే పెద్దాపురం-సామర్లకోట రహదారి నిర్మాణ పనుల సమయంలో పలువురు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి.
రాత్రి సమయాల్లో ఆగని పనులు
రాత్రి సమయాల్లో పనులు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ అవేమీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఎవరికీ తెలియదన్న ఉద్దేశ్యంతో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా తిలోదాకాలిచ్చి తూతూమంత్రంగా పనికానీచేస్తున్నట్టు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇవేమీ ఆర్ అండ్ బీ అధికారులకు పట్టడంలేదు. ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియడం లేదని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రహదారి నిర్మాణ పనులు ఈవిధంగా నాణ్యత లేకుండా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ అండ్ బీ అధికారుల తీరుతో పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో రహదారులను అభివృద్ధి చేద్దామని తలిచినా అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మెరుగైన రహదారులు ఏర్పడకపోగా  ప్రజాధనం వృధాగా రోడ్డు పాలయిపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

ads