బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ వేడుకలు నిషేధం:ఎస్పీ అద్నాన్ నయీమ్అస్మీ

కాకినాడా,30 డిసెంబర్ 2020(రెడ్ బీ న్యూస్): కొవిడ్‌ వ్యాధి దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, హైవేలు, రోడ్లపై నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ స్పష్టం చేశారు. చలి, మంచు వాతావరణంలో కొవిడ్‌ వైరస్‌ ప్రబలే అవకాశం ఉందన్నారు. నివారణా చర్యల్లో భాగంగా నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చి ఇతరులకు అసౌకర్యం కలిగించినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా చర్యలు తప్పవన్నారు. యువకులు బైక్‌ రేసింగ్‌ పాల్పడడం, బైక్‌ల సైలెన్సర్‌లు తీసి అలజడి సృష్టిస్తూ వీధుల్లో తిరిగితే ఏ మాత్రం ఉపేక్షించేదిలేదన్నారు. వ్యాపార సంస్థలు, బార్లు, వైన్‌షాన్‌లు, రెస్టారెంట్లు నిర్దేశించిన సమయానికి తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. బార్‌, రెస్టారెంట్లలో అశ్లీల నృత్యాలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టవ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం రాత్రి అదనపు బలగాలతో గస్తీ మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లలో పోలీస్‌ పికెట్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు సహకరించాలని, ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు గడపాలని కోరారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ads