వైద్య వృత్తి విలువను మరింత పెంపొందించాలి

* కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి
* లెనోరాలో ఘనంగా స్నాతకోత్సవం

UPDATED 12th OCTOBER 2020 MONDAY 9:00 PM

రాజానగరం (రెడ్ బీ న్యూస్): సమాజంలో వైద్య వృత్తికి ఉన్న విలువను మరింత పెంపొందించేలా కృషి చేయాలని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి పేర్కొన్నారు. కోవిడ్-19 నిబంధనలు నడుమ స్థానిక కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల స్నాతకోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులకు తొలుత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం కళాశాలలోకి అనుమతించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ నాగమణి మాట్లాడుతూ తొలుత కళాశాల నుంచి డిగ్రీలు తీసుకుని బయటకు వెళ్తున్న నూరు మంది విద్యార్థుల బ్యాచ్ ని అభినందించారు. మీరంతా ఉన్నత చదువులు చదువుకుని అత్యున్నత స్థానాలకు ఎదగాలని, మీకు ఎలాంటి సహాయ సహకారం అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ సభ్యుడు కె. సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులకు రోగి ప్రత్యక్ష దేవుడని, వారి మన్ననలు పొందినపుడే రాణిస్తామన్న విషయాన్ని వైద్యులు తప్పనిసరిగా గుర్తించుకోవాలని అన్నారు. రోగుల పట్ల గౌరవంతో మెలుగుతూ వారిని సంతృప్తి పరచడం మన విధి అన్నారు. కళాశాల కార్యదర్శి కె. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ బ్యాచ్ విద్యార్థులు తమకు ఎంతో ప్రత్యేకమని,  తమ విద్యార్థులు ఎన్నోర్యాంకులు సాధించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీ ఫలితాల్లో కూడా యూనివర్సిటీ స్థాయిలో అత్యున్నత ర్యాంకులు కైవసం చేసుకుని తమ కళాశాల పేరు ప్రఖ్యాతలు ఇనుమడింపచేశారని పేర్కొన్నారు. కోశాధికారి కె. సింధు మాట్లాడుతూ ఈ బ్యాచ్ విద్యార్థులు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను కూడా సందర్శించారని, అందులో భాగంగా మలేసియాలో వైద్యులు రోగులకు చికిత్స అందించే విధానం పరిశీలించడం జరిగిందన్నారు. ప్రత్యేక అతిధి స్నేహిత్ రెడ్డి మాట్లాడుతూ మంచి ఆలోచనలు ఉన్నవారు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక  నైపుణ్యం ఉంటుందని దాన్ని గుర్తించి ఎంచుకున్న రంగంలో కష్టించి పనిచేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. అనంతరం అతిధులు విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, డైరెక్టర్(పిజి స్టడీస్) డాక్టర్ బి. లక్ష్మణరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.    

ads