ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు

* కదిలొచ్చిన యువతరం.. మహిళాలోకం
* గంటల తరబడి నిరీక్షించి ఓటు హక్కు వినియోగం

UPDATED 11th APRIL 2019 THURSDAY 10:00 PM

సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురురువారం ప్రశాంతంగా ముగిసింది. సామర్లకోట పట్టణ, రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈవీఎంల మొరాయింపు, ఎండ వేడిమి సైతం తట్టుకుని స్వేచ్ఛగా తమ ప్రజాస్వామ్య హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద యువత, మహిళలు, వృద్ధులు బారులుదీరి కన్పించారు. గంటల కొద్దీ వేచి ఉండి మరీ ఓటు వేసి వెళ్లారు. ఉదయం మాక్ పోలింగ్ ప్రక్రియ నిర్వహించిన అనంతరం సాంకేతిక లోపాలు ఎదురయ్యాయి. ఓటు వేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సాంకేతిక లోపాలను సరిదిద్దారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 44.22 శాతం, మధ్యాహ్నం మూడు గంటలకు 59.79 శాతం, సాయంత్రం ఆరు గంటల వరకు సుమారు 75 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాలను పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు, సీఐ యువకుమార్, ఎస్సై కిషోర్ పర్యవేక్షించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఘర్షణలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.  

 

ads