సమాజ భాగస్వామ్యం, అవగాహనతోనే ఎయిడ్స్‌కు పరిష్కారం

UPDATED 1st DECEMBER 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): సమాజ భాగస్వామ్యం, అవగాహనతోనే ఎయిడ్స్‌కు పరిష్కారమని, ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తూ ఎయిడ్స్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని పెద్దాపురం తహసీల్దార్ కె. పద్మావతి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజ్-సీబీవో సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమన్వయంతో ఆదివారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణ వీధులగుండా ప్రదర్శన చేపట్టి మున్సిపల్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పద్మావతి మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితులకు సమాజం అందించే ఓదార్పే చికిత్సలాగా పని చేస్తుందని, ఆరోగ్య సమాజం కోసం ప్రతీ వ్యక్తి పాటు పడాలని అన్నారు. వైజ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ డి. రాజు మాట్లాడుతూ చాప కింద నీరులా వ్యాపించే ఎయిడ్స్‌ మహమ్మారి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ సమష్టి బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. యుక్త వయసు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారిలో సామాజిక స్పృహ పెంపొందించాలని, ఇలా చేయకపోవడంతో కొందరు యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి హెచ్‌ఐవీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. వ్యాధి సోకిన వారి పట్ల చులకన భావాన్ని ప్రదర్శించకూడదని, వారిలో మనో స్థైర్యాన్ని నింపుతూ సమాజంలో స్వేచ్ఛగా బతికేలా చూడాలన్నారు. బాధితుల జీవిత కాలాన్ని పెంచేందుకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైజ్ సంస్థ ప్రెసిడెంట్ మల్లేశ్వరి, పిడి దేవి, డిపిఎంవో రాధాకృష్ణ, వివిధ కళాశాలల విద్యార్థులు, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

ads