విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి

* జాయింట్ కలెక్టరు కీర్తి చేకూరి

UPDATED 27th JUNE 2020 SATURDAY 6:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): మనబడి నాడు-నేడు కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తిని పెంపొందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టరు-2 (అభివృద్ధి, సచివాలయాలు) కీర్తి చేకూరి ఉపాధ్యాయులు. కార్యనిర్వాహక ఇంజనీర్లును ఆదేశించారు. మండల పరిధిలోని ముసురుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న మనబడి నాడు-నేడు కార్యక్రమాల నిర్వహణ తీరును శనివారం ఆమె పరిశీలించి పాఠశాలలో విద్యార్థులు, వసతులు తదితర వివరాలను హెచ్ఎం, వార్డెన్ ను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల వసతుల కల్పనకు మనబడి నాడు-నేడు కార్యక్రమాల ద్వారా చర్యలు తీసుకొని నాణ్యమైన విద్యాబోధనకు పాటుపడాలని అన్నారు. విద్యా సంస్థలలో పలు సంస్కరణలు, సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి అమ్మఒడి, మధ్యాహ్నాభోజన పథకం, మనబడి నాడు-నేడు, ఫీజు రియంబర్సుమెంటు వంటి కార్యక్రమాలను ప్రవేశ పెట్టిందని, వీటిని సమర్ధవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సత్ఫలితాలు రాబట్టడంలో ఉపాధ్యాయులు, విద్యా కమిటీల సహకారం కూడా ఎంతైనా అవసరమని, తల్లిదండ్రుల కమిటీలు, విద్యాశాఖాధికారులు సమన్వయంతో ప్రవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి పిల్లలకు మంచి వాతావరణంలో విద్యను అందించాలని సూచించారు. నాడు-నేడు కార్యక్రమాల నిర్వహణకై ప్రభుత్వం తొమ్మిది రకాల అభివృద్ధి సూచికలను జారీ చేసిందని, అలాగే చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్ చేస్తూ చెల్లింపులు జరపాలని హెచ్ఎంలను ఆదేశించారు. నాడు-నేడు పనులకు సంబంధించిన మెటీరియల్ కొనుగోలులో జిల్లాలో ఉన్న ప్రతీ షాపు 15 నుంచి 20 శాతం రాయితీని ఇస్తారని వాటి ద్వారా మిగిలిన నిధులు వేరే పనులకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ ఆశ్రమ పాఠశాలకు ఐదు అభివృద్ధి  సూచికలకు రూ.35 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమాధికారిణి సుజాత, హెచ్ఎం పి. రాజబాబు, తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, మండల విద్యాశాఖాధికారిణి గౌరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

ads