ఘనంగా మట్టల ఆదివారం

UPDATED 14th APRIL 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణంలో మట్టల ఆదివారం పర్వదినాన్ని క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆర్ పిఎం చర్చి రెవరెండ్ ఫాదర్ శేఖర్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ కాలనీ నుంచి ఏసుక్రీస్తును రారాజుగా స్మరిస్తూ జేజేలు పలుకుతూ ఊరేగింపు నిర్వహించారు. సండే స్కూల్ చిన్నారులు ఈత మట్టలను పూలతో అలంకరించి యేసు రాజుకు జయహో అంటూ పురవీధుల్లో తిరిగారు. అన్ని చర్చిలలో ఉదయం నుంచే ఈత కొమ్మలతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతీ ఏటా ఈస్టర్‌కు ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా పాటిస్తుంటారు. క్రీస్తు ప్రభువును దేవుని కుమారునిగా, శాంతి దూతగా సర్వమానవాళికి రక్షకుడిగా అంగీకరిస్తూ బెతానియా గ్రామం నుంచి యెరుషలేము వరకు గాడిదపై నగర పురవీధుల్లో ఊరేగించినట్లు బైబిల్‌ చెబుతోంది. ఆ ఊరేగింపులో ఆయనను శాంతిదూతగా, దేవునిగా అంగీకరిస్తూ వస్ర్తాలను పరచి చేతిలో మ్రాను కొమ్మలతో విశ్వాసులు పాల్గొన్నారు. దానిని ప్రస్ఫుటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్‌ పర్వదినానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి స్థానిక ఆంధ్రా బాపిస్టు, లూథరన్ సెంటినరీ, బెరాకా తదితర చర్చిలలో సండే స్కూల్ చిన్నారులు పట్టణ వీధుల్లో వస్త్రాలు పరిచి పూలు చల్లుతూ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు స్థానిక బ్రౌన్ పేట సెంటర్ మీదుగా ఆర్పీఎం చర్చికు చేరుకుంది. 

 

ads