పౌష్ఠికాహారంతో గర్భిణీలకు మెరుగైన ఆరోగ్యం

UPDATED 9th SEPTEMBER 2019 MONDAY 6:30 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): గర్భిణీ స్త్రీలు మంచి పౌష్ఠికాహారం తీసుకోవడం వలన మెరుగైన ఆరోగ్యం పొందడంతో పాటు ఆరోగ్యమైన బిడ్డకు జన్మనిస్తారని డాక్టర్ రామ్ నాయక్ తెలిపారు. పౌష్ఠికాహార మాసోత్సవాలను పురస్కరించుకుని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పులిమేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహనా సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులిమేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్ఠికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యమైన బిడ్డకు జన్మనిస్తారని అన్నారు. చిన్నారుల్లో పౌష్ఠికాహార లోపం, రక్తహీనత కారణంగా వయస్సుకు తగిన బరువు, ఎత్తు, వికాసం లేకుండా సక్రమమైన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు గర్భిణీ స్త్రీలు పౌష్ఠికాహారం తీసుకోకపోవడం వలన వస్తాయని తెలిపారు. గర్భిణీ స్త్రీలలో హిమోగ్లోబిన్ 12 శాతం కంటే తక్కువ లేకుండా ఉండాలని, దీనిని అధిగమించడానికి పౌష్ఠికాహారమైన ఆకుకూరలు, పాలు, గ్రుడ్లు తరచూ తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు కాళ్ళ వాపులు సహజమని దానికి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్ఠికాహారాన్ని ఉచితంగా అందజేస్తుందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహించి గర్భంలో ఉన్న బిడ్డ కదలికలు పరీక్షించి తగిన మందులు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో పి. సావిత్రి మాట్లాడుతూ పిల్లల్లో పౌష్ఠికాహార లోపం, మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి పౌష్ఠికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ నెల తొమ్మిదవ తేదీన ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో మా శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, సూపర్ వైజర్ చంద్రకళ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads