అధికారుల తీరుపై ఆర్డీవో ఫైర్

UPDATED 2nd MARCH 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామక్షేత్రం శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం నిర్వహించిన ఏర్పాట్లపై కాకినాడ ఆర్డీవో రాజకుమారి దేవాదాయ, మున్సిపల్ అధికారులపై ఫైర్ అయ్యారు. ఆదివారం ఆలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజకుమారి మాట్లాడుతూ సోమవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, క్యూలైన్లో భక్తులకు మజ్జిగ, పాలు, త్రాగునీరు సక్రమంగా అందేలా చూడాలని, అలాగే కోనేరు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గజ ఈతగాళ్లు ఎక్కువ మందిని ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు ఆదేశించారు. పుష్కరిణి వద్ద పారిశుధ్య లోపంపై దేవాదాయ, మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరిణి వద్ద వెంటనే క్లోరినేషన్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రమబద్ధీకరించాలని పోలీస్ శాఖను కోరారు. గోదావరి కాలువలో మురికినీరు రాకుండా ఉండటానికి వారం రోజుల ముందు నోటీసులు ఇచ్చామని, గోదావరి కాల్వలోకి మురుగునీరు వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బాత్రూంలను పరిశీలించి నీళ్లు రాకపోవడంతో అధికారులను నిలదీశారు. అలాగే మహిళలు బట్టలు మార్చుకునే గదుల వద్ద క్లాత్ వర్కు చేయించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సేవా సంస్థల సమన్వయంతో మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, సామర్లకోట ఎస్సై వి. కిషోర్, ఆర్. రాజేష్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads