వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు రైతులకు అందుబాటులో ఉండాలి

* పంటల రక్షణపై రైతులకు అవగాహన కల్పించాలి
* వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు

UPDATED 20th OCTOBER 2020 TUESDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల శాస్త్ర‌వేత్త‌లంద‌రూ క్షేత్ర‌స్థాయిలో రైతుల‌కు అందుబాటులో ఉండాల‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని తన క్యాంపు కార్యాల‌యంలో వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల‌తో ఆయన మంగళవారం  సమావేశం నిర్వహించారు. తొలుత వ‌రి, ప‌త్తి త‌దిత‌ర పంట‌ల‌కు సంబంధించిన న‌ష్టం వివ‌రాలు, ఆయా పంట‌ల‌ను రక్షించేందుకు ఉన్న అవ‌కాశాలు, తదితర అంశాలపై శాస్త్ర‌వేత్త‌లు మంత్రికి నివేదిక అంద‌జేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఉభ‌య గోదావ‌రి, కృష్ణా త‌దిత‌ర జిల్లాల్లో గ‌త పది సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా పంట పొలాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయ‌ని, ఇలాంటి సంక్షోభ స‌మ‌యంలో రైతుల‌ను అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అన్నారు.  ఆచార్య ఎన్‌జీ రంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం, డాక్టర్ వైఎస్ఆర్  ఉద్యానవ‌న‌ విశ్వ ‌విద్యాల‌యం, ఇత‌ర ప‌రిశోధ‌న కేంద్రాల శాస్త్రవేత్తలు అధికారుల‌తో క‌లిసి గ్రామాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించి పంట‌ల‌ను రక్షించే విష‌యంలో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. పంటల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు ముద్రించి, రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా శాస్త్రవేత్తల సూచనలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేరవేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. వాయిస్ మెసేజ్ ల ద్వారా కూడా అవగాహన కల్పించేలా దృష్టి సారించాలని, రైతు భరోసా కేoద్రాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు, శాస్త్రవేత్తల నంబర్లను ప్రదర్శించాలన్నారు.
రబీకి ప్రణాళికలు సిద్ధం చేయండి
వచ్చే రబీ సీజన్ కు సంబంధించి విత్తన ప్రణాళికలను రూపొందించాలని, ఏ పంటలకు ఏ విత్తనాలు ఉపయోగించాలనే దానిపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎటపాక వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రత్తి పంట దెబ్బతిందని, అక్కడికి ప్రత్యేకంగా శాస్త్రవేత్తల బృందాలను పంపాలని మంత్రి సూచించారు. ఈ  సమావేశంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జి. జోగినాయిడు, డాక్టర్ ఏ. సీతారామశర్మ, డాక్టర్ ఐ. సుధీర్ కుమార్, డాక్టర్ నాగేంద్ర, డీడీ (ఏ) పీవీఎన్ నాగాచారి, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads