క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

* ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ శ్రీనివాస్‌
* జవహర్‌ నవోదయాలో ప్రారంభమైన క్లస్టర్‌ స్థాయి బాల్ గేమ్స్‌

UPDATED 10th JULY 2019 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కెఇ శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక జవహర్‌ నవోదయా విద్యాలయలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న క్లస్టర్‌ స్థాయి బాల్ గేమ్స్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు. ప్రతీ విద్యార్థి క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలని, గెలుపు ఓటమిలు ముఖ్యం కాదని, క్రీడా స్ఫూర్తి ముఖ్యమని, క్రీడా పోటీల్లో జయాపజయాలను సమానంగా స్వీకరించాలని తెలిపారు. 
అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విశాఖ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. మునిరామయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads