రైతు పండించిన పంటకు ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తుంది : ఆర్డీవో మల్లిబాబు

పెద్దాపురం,2 మే 2020 (రెడ్ బీ న్యూస్):ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు శనివారం పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. డివిజన్ పరిధిలో పండించిన ధాన్యాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. డివిజన్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు ధాన్యాన్ని పండించిన ప్రతి రైతు వివరాలు యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి వారికి కూపన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులు పండించిన ధాన్యాన్ని ఎప్పుడు అమ్ముతారో తెలుసుకుని ఆ వివరాలను సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తారని తెలిపారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1835, సాధారణ రకం క్వింటాలు ధాన్యానికి రూ.1815 చెల్లిస్తుందని, రైతులెవ్వరూ తమ ధాన్యాన్ని మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవద్దని తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల పొలాల వద్దకు వెళ్లి పిపిసి కూపన్లు అడ్వాన్స్ గా ఇస్తారని,అలాగే దిగుబడి అంచనా వివరాలు, కొనుగోలు తేదీని నమోదు చేస్తారని తెలిపారు.ఈ తేదీన వ్యవసాయ సహాయకులు రైతుల పొలాల వద్దకు వెళ్లి నాణ్యత ప్రమాణాలు పరీక్ష చేసి,ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని తెలిపారు.దీనికి సంబంధించి ఏమైన ఫిర్యాదులు ఉంటే 1902 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆర్డీవో తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీఏ రత్న ప్రశాంతి పాల్గొన్నారు.
ads