తెగుళ్ళ నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరి

* ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ సీతారామ శర్మ

UPDATED 26th JUNE 2020 FRIDAY 7:00 AM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): వరిలో తొలిదశ తెగుళ్ళ నివారణకు విత్తన శుద్ధి ఎంతో అవసరమని ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ ఏ. సీతారామశర్మ పేర్కొన్నారు. ఖరీఫ్ పంట సాగుకు సంబంధించి విత్తన శుద్ధి ఏవిధంగా చేసుకోవాలో ఆయన శుక్రవారం వివరించారు. విత్తన వరి పంటను తొలి దశలో ఆశించే తెగుళ్ళ నివారణకు ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండిజం 50 శాతం మందును కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలన్నారు. దుంప నారుమడులకు అయితే లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం 50 శాతం మందును కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండె కట్టి మొలకెత్తిన విత్తనాన్ని దుంప నారుమడిలో నాటుకోవాలని అన్నారు. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందు నీరు సరిపోతుందన్నారు. కార్పెండిజం 25 శాతం, మాంకోజట్ 50 శాతం మిశ్రమ శిలీంధ్రనాశినిని వాడదలచుకున్న రైతులు లీటరు నీటికి 2 గ్రాములు చొప్పున కలుపుకుని కిలో విత్తనాన్ని ఉంచి 24 గంటలు తరువాత నారుమడిలో చల్లుకోవాలన్నారు. మొక్కజొన్న పంటను తొలిదశలో ఆశించే తెగుళ్ళ నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెట్ లేదా దైరాం లేదా కాఫ్టాన్ తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. అలాగే తొలిదశ కత్తెర పురుగు నివారణకు ఒక కిలో విత్తనానికి సయాంత్రనిలిప్రోల్ 19.8 % + ధయోమీధోక్సాం 19.8 % మందును 6 మి.లీ చొప్పున కలుపుకుని విత్తన శుద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. 

ads