సద్గుణాలకు ప్రతీక ఉపాధ్యాయులు

UPDATED 5th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : సద్గుణాలకు ప్రతీక ఉపాధ్యాయులని, అలాంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయడంతోపాటు వారిలో సద్గుణాలు, నైతిక విలువలను పెంపొందించే విధంగా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని గురుపూజోత్సవ వేడుకలు గురువారం స్థానిక లైన్స్ క్లబ్ భవనంలో ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దవులూరి దొరబాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లోనే అన్ని అంశాలపై ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంటుందని, వారు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని, నేటి సమాజంలో విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉందని అన్నారు. విద్యార్థులను అహంకారానికి, భావోద్వేగాలకు దూరంగా ఉంచడం, మంచి సంస్కారం, నైతిక విలువలను పెంపొందిస్తే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిబడతారని పేర్కొన్నారు. విద్యారంగం అభివద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. సామర్లకోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో కార్పోరేట్  పాఠశాలలుగా మార్చడానికి కృషి చేస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా అనేక మంది పేద విద్యార్థులు సైతం నేడు చదువుకోడానికి అవకాశం కలిగిందని అన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఎస్. అబ్దుల్ సత్తార్ ను దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే  2019లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవులూరి సుబ్బారావు, ఆవాల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, ఎంపిడివో కర్రి స్వప్న, మండల ఎస్టీయు నాయకులు శ్రీనివాసరావు, అర్జున్ కుమార్, యుటిఎఫ్ నాయకులు తాతబ్బాయి, శ్రీనివాస్, అశోక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి దొరబాబు, బిక్కవోలు ఎంఈవో వైవి శివ రామకృష్ణయ్య, తోటకూర సాయిరామకృష్ణ, తలారి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

ads