ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత

UPDATED 6th SEPTEMBER 2019 FRIDAY 6:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్) : విద్యార్థులను బాధ్యతాయుతమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని ఆదిత్య విద్యా సంస్థల కార్యదర్శి నల్లమిల్లి కృష్ణదీపక్ రెడ్డి, ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య సి.బి.ఎస్.ఇ అకాడమీలో ప్రిన్సిపాల్ జి. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల కార్యదర్శి నల్లమిల్లి కృష్ణదీపక్ రెడ్డి, ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి  భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆదిత్య విద్యా సంస్థల కార్యదర్శి కృష్ణదీపక్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గురువుల స్థానం ఎంతో అత్యున్నతమైనదని, విద్యతోనే సమాజం ఉన్నతంగా ఉంటుందని, అది ఉపాధ్యాయులతోనే సాధ్యమని అన్నారు. అనేక కష్టాలతో విద్యను అభ్యసించి, అధ్యాపకునిగా, రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి అందరికీ ఆదర్శమని, గురువు స్థానం చెక్కు చెదరకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి జీవితానికి మంచి బాటలు పరిచే గురువుకు ఏమిచ్చినా రుణం తీర్చలేమని, తల్లిదండ్రులు తర్వాత గురువే విద్యార్థులకు ఆరాధ్యుడని అన్నారు. విద్యార్థులు ఉన్నతస్థితికి చేరినా గురువులను మరిచిపోరాదని, గురువును మించిన దైవం లేదని, గురువును పూజిస్తే దైవాన్ని పూజించినట్లేనని ఆమె అన్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు బహుమతులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads